|
కేకలతూరి క్రిష్ణయ్య రచయిత చిత్తూరు జిల్లాలో పాకాల మండలం, శంఖంపల్లె గ్రామంలో 02.05.1938వ తేదీన కీర్తిశేషులు నాగమ్మ, పాపయ్య దంపతులకు జన్మించారు. వీరికి రచయిత ఆఖరి ఎనిమిదవ సంతానం. ఆరేళ్ళ వయస్సులో తండ్రి పరమపదించిన తరువాత వాళ్ళ కుటుంబం చంద్రగిరి తాలూకాలోని కల్‌రోడ్డు పల్లెకి వలస వెళ్ళింది చిన్నతనం నుండి ఎన్నో కష్టనష్టములు కోర్చి వివిధ ప్రాంతాలు తిరిగి చిత్తూరు జిల్లా చంద్రగిరిలో హైస్కూలు చదువు పూర్తి చేశారు.
కుటుంబ పరిస్థితుల ప్రభావం వలన 1956 నుండి జీవితం మనుగడకు పోరాటం ఆరంభించి ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నా రుచించక హైదరాబాదులో ప్రైవేటు ఇంజనీరింగ్ నిర్మాణ పనులు చేయు కంపెనీలో 1961-62 సంవత్సరంలో చేరారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ నిర్మాణ పనులలో నిర్విరామ కృషితో, జ్ఞానాభివృద్థి చెందుతూ ఇంజనీర్ స్థాయికి ఎదిగారు. దేశవిదేశాలలో 50 సంవత్సరములకు పైగా ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఈ కాలంలో యు.కె., రష్యా, ఫిన్‌లాండ్, ఇటలీ, జర్మనీ ఇంజనీరింగు సలహాదారులతో కలసి పని చేయడం జరిగింది. అంతేగాక ఉద్యోగ రీత్యా, విహారయాత్ర రీత్యా దుబాయి, నేపాలు, శ్రీలంక, సింగపూర్, మలేషియా మరియు యూరప్ దేశాలు పర్యటించారు. చిన్నప్పటి నుండి క్రీడానుభవం మెండుగా ఉంది. ఈ జ్ఞానానికి తన జీవితాఅనుభవం మేళవించి అక్షరం రూపం దాల్చితే సమాజానికి ఉపయోగపడుతుందని రచనా వ్యాసంగం ఆరంభించారు. ఇప్పటి వరకూ 18 తెలుగు పుస్తకములు, 5 ఇంగ్లీషు పుస్తకములు రచించారు. 'సామాజిక రచనాశిల్పి', 'విశ్వహితభూషణ', 'కవికోకిల' బిరుదులు పొందారు. యువకళావాహిని వారి "జీవిత సాఫల్య పురస్కారం", శ్రీ కమలాకర లలిత కళాభారతి వారి ‘జీవిత సాఫల్య పురస్కారం’ పొందారు. |